కాకతీయ, తెలంగాణ బ్యూరో: మావోయిస్ట పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా సాగుతున్న సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరామం ఇస్తూ, చర్చలకు సిద్ధమని పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ విడుదలైంది. దేశం, ప్రపంచం మారుతున్న పరిణామాల దృష్ట్యా ఇకపై ఆయుధాలను విడిచి ప్రధాన స్రవంతిలో కలిసిపోవాలన్న ఆలోచనకు పార్టీ అంగీకరించినట్టు లేఖలో స్పష్టం చేశారు. 30 రోజులపాటు కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించాలని కోరుతూ, ఆ గడువులో సహచరులతో చర్చలు జరుపుతామని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అవసరమైతే ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలతో కలిసి పోరాడతామని మావోయిస్టులు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి లేదా ఆయన ప్రతినిధులతో, వీడియో కాల్ ద్వారానైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మృతి తరువాత, తిప్పిరి తిరుపతి కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంతోనే అభయ్ పేరిట లేఖ వెలువడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా, మావోయిస్టు నాయకుని ఫోటోతో లేఖ విడుదల కావడం అరుదైన పరిణామంగా భావిస్తున్నారు.
మార్చి నెలలోనే శాంతి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మావోయిస్టులు అభ్యర్థించారని, అదే విషయాన్ని మే 10న కూడా ఒక ప్రకటనలో స్పష్టం చేసినట్టు లేఖలో గుర్తుచేశారు. ఈసారి మాత్రం ఆయుధ విరమణ, కాల్పుల విరమణపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గత సంవత్సరం నుంచి భద్రతా బలగాలు విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నాయని, మే 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో తమ ప్రధాన కార్యదర్శి బసవరాజుతో పాటు పలువురు కీలక నాయకులు వీరమరణం పొందారని పార్టీ లేఖలో పేర్కొంది.
అయినప్పటికీ, మధ్యలో ఆగిపోయిన శాంతి చర్చలను మళ్లీ ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ కొత్త నిర్ణయమని వెల్లడించారు.మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు మొదటిసారిగా ఆయుధాలను విడిచి పెట్టేందుకు, కాల్పుల విరమణకు, శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఈ నిర్ణయం, వారి కొత్త నాయకత్వంలో పార్టీ వైఖరి మారుతున్న సంకేతంగా పరిగణించబడుతోంది.


