మేడారం జాతర ట్రాఫిక్‌పై సీపీ నజర్
గద్దెల మార్గంలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ
సీసీ కెమెరాల నిఘాలో భక్తుల భద్రత
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు వరంగల్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. వరంగల్ నగరం నుంచి మేడారం గద్దెల వరకు కొనసాగుతున్న ప్రధాన రహదారి మార్గంలో ట్రాఫిక్ పరిస్థితిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పస్రా, తాడ్వాయి తదితర కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ప్రవాహాన్ని పర్యవేక్షించి, అక్కడి సెక్టార్ అధికారులకు పలు సూచనలు చేశారు. సీపీ పర్యటన సందర్భంగా వాహనాల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల వినియోగం, దశలవారీగా వాహనాల విడుదల, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు.

సీసీ కెమెరాల నిఘాలో జాతర మార్గం
మేడారం మహాజాతర వేళ భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ అత్యాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి మేడారం గద్దెల వరకు ప్రతి వాహన కదలికను పర్యవేక్షించేలా సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. ట్రైసిటీ పరిధిలో 715, మేడారం మార్గంలో 530 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా క్షణాల్లో గుర్తించి చర్యలు తీసుకునేలా వ్యవస్థను సిద్ధం చేశారు.


