నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన సీపీ సన్ ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ : తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించిన సీపీ, అధికారులు తీసుకున్న ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో చట్టవ్యవస్థ, శాంతిభద్రతలు కాపాడే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి అభ్యర్థులు, కార్యకర్తలు పాటించాల్సిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పగటిపూటే కాకుండా అవసరమైతే రాత్రిపూట కూడా మోహరించాలని సీపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్, ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


