రఘునాథ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో సీపీ తనిఖీ
స్టేషన్ నిర్వహణ మెరుగుపరచాలని ఆదేశాలు
పెద్దపులి సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచన
కాకతీయ, హనుమకొండ : రఘునాథ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన, రికార్డు రూమ్, స్టేషన్ రైటర్ రూమ్, రిసెప్షన్ సెంటర్ తదితర విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ మరింత క్రమబద్ధంగా ఉండాలని, రికార్డులను సక్రమంగా భద్రపరచాలని అధికారులకు స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, నేరాల పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు, చోరీ కేసుల పురోగతిపై సీపీ ప్రత్యేకంగా ఆరా తీశారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, ప్రజలకు పోలీస్ శాఖ సేవలు మరింత సమర్థవంతంగా అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం రఘునాథ్‌పల్లి మండలం, పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని సీపీ తెలిపారు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఘన్‌పూర్ ఏసీపీ భీమ్ శర్మ, సీఐ శ్రీనివాస్ రెడ్డి, రఘునాథ్‌పల్లి ఎస్‌ఐ నరేష్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


