కరీంనగర్ పోలీసుల ఓపెన్ హౌస్
పోలీసు భద్రతా, ఆయుధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన
కాకతీయ, కరీంనగర్ : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. నగరంలోని పలు విద్యాసంస్థల విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ పనితీరును ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. డిపార్ట్‌మెంట్‌లో ఉపయోగించే ఆధునిక పరికరాలు, ఆయుధాలు, సాంకేతిక పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని సీపీ తెలిపారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ యూనిట్, కమాండ్ కంట్రోల్ వాహనం, వజ్ర వాహనం, స్మోక్ షెల్స్, మెటల్ డిటెక్టర్లు తదితర పరికరాలను ప్రదర్శించడం జరిగిందన్నారు. అల్లర్ల నియంత్రణ, శాంతి భద్రతా పరిరక్షణలో పోలీసులు ఎలా పని చేస్తారో విద్యార్థులకు అవగహన కల్పించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా షీ టీమ్, సైబర్ క్రైమ్, యాంటీ నార్కోటిక్ సెల్, ట్రాఫిక్ విభాగాలకు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫిర్యాదులు చేయు విధానం గురించి విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు.



