కాకతీయ, హనుమకొండ : నగరంలోని ఓరుగల్లు భద్రకాళి దేవాలయం సమీపంలో నిర్వహిస్తున్న గోవింద గోశాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి సందర్శించారు. ఈ గోశాలను తాడూరి దీప్తి, శ్వేతా, ప్రీతి అనే ముగ్గురు అక్కాచెల్లెల్లు కలిసి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక పోకడల వైపు పరుగులు తీస్తున్న యువతలో ఇలాంటివారు గోసేవలో అంకితభావంతో ముందుకు రావడం ఎంతో సంతోషకరమని అన్నారు.
గోసంరక్షణ, గోపాలన, గో పదార్థాల వినియోగంపై సమాజంలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ సోదరీమణులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. ప్రైవేట్ టీచర్లుగా, పాఠశాల నిర్వాహకులుగా విద్యార్థులకు విలువలను బోధిస్తూ, గోశాల ద్వారా వాటిని ఆచరణలో చూపడం స్ఫూర్తిదాయకమని అభినందించారు. అరుణాచల శివ, దాక్షాయిణి, విజయ గణపతి, నాగేంద్రుడు, గంగ వంటి పేర్లతో పెంచుతున్న గోవులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పారు. వరంగల్, హన్మకొండలోని ప్రజలందరూ ఈ గోశాలను సందర్శించి నిర్వాహకులకు చేయూత అందించాలని ఆయన పిలుపునిచ్చారు.


