కాకతీయ, హనుమకొండ : మధ్యవర్తిత్వం ద్వారా కోర్టుల కేసులను గణనీయంగా తగ్గించవచ్చని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి. సామ్ కోషి పేర్కొన్నారు. సుబేదారిలోని డి.సి.సి. బ్యాంక్‌లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల న్యాయవాదుల కోసం 40 గంటల శిక్షణా కార్యక్రమం వివరణ సమావేశం జరిగింది.
శాంతి.. సామరస్యానికి దోహదం:
జస్టిస్ సామ్ కోషి మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని, ఇరువైపుల మధ్య శాంతి, సామరస్యాన్ని నెలకొల్పుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా మధ్యవర్తిత్వాన్ని విస్తరించడానికి ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పనిచేయాలని సూచించారు. హైకోర్టు న్యాయమూర్తి జే. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కక్షిదారులు తమ కోపతాపాలను పక్కన పెట్టి సమస్యలను పరిష్కరించుకునేలా మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని తెలిపారు.
వాణిజ్య, వ్యక్తిగత సంబంధాలు చెడిపోకుండా కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ ప్రధాన న్యాయమూర్తులు వి.బి. నిర్మలా గీతాంబ, డా. బి. పట్టాభిరామా రావు, న్యాయమూర్తులు నారాయణ బాబు, మనీషా శ్రావణ్ ఉన్నమ్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం. సాయి కుమార్, క్షమా దేశ్ పాండే, బార్ కౌన్సిల్ సభ్యులు దుస్స. జనార్ధన్, బైరపాక జయాకర్, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


