కాంగ్రెస్ పాలనలో కరప్షన్ గని
సింగరేణి కేంద్ర విజిలెన్స్ సీబీఐ పరిధిలోకి తేవాలి
హెచ్ ఎంఎస్ తో సింగరేణి జాగృతి : ఎమ్మెల్సీ కవిత
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కరప్షన్ గనిగా మారిందని ఆరోపించారు. ఉద్యోగ నియామకాలు, ప్రాజెక్టు ఖర్చులు, లాభాల లెక్కలు సహా అన్నింట్లో అవినీతి జరుగుతోందని మండిపడ్డారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ అంచనా వ్యయాలను రాత్రికి రాత్రే అమాంతం పెంచారని దుయ్యబట్టారు. సింగరేణిని రాజకీయ అవినీతి నుంచి రక్షించాలంటే సంస్థను కేంద్ర విజిలెన్స్, సీబీఐ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఎంతో కృషి చేసి సింగరేణిని కాపాడారని, కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ అవినీతి పెరిగిందని ఆరోపించారు. కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి దసరా తర్వాత సింగరేణి యాత్ర చేపడతామని ప్రకటించారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల పెద్దలకే లాభం చేకూరుస్తుందని ఆరోపించారు. కాలుష్యం పెరుగకుండా అండర్‌గ్రౌండ్ మ్యాన్యువల్ గనులను తిరిగి తెరవాలని సూచించారు. కాగా, బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్‌తో ఆమె చర్చలు జరిగాయి. సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.