కాకతీయ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీలో అవినీతి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పౌర సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న మహిళా కంప్యూటర్ ఆపరేటర్ సుభాషిణి రూ.56 లక్షల నిధులను కాజేసిన విషయం బయటపడింది. సాధారణంగా పౌరులు ట్రేడ్ లైసెన్స్, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి పన్ను దరఖాస్తులు వంటి సేవల కోసం చెల్లించే ఫీజులు నేరుగా జీహెచ్ఎంసీ ఖాతాలో జమ చేయాలి. అయితే, సుభాషిణి వసూలు చేసిన మొత్తం డబ్బును ఖజానాలో జమ చేయకుండా తన వద్దే ఉంచినట్టు ఆడిట్‌లో బయటపడింది.
ఆడిట్‌లో బహిర్గతమైన అవినీతి:
2024–25 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు సుభాషిణి ప్రజల వద్ద నుండి సేకరించిన రూ.56 లక్షలు జీహెచ్ఎంసీ ఖాతాలోకి చేరలేదని ఆడిట్ అధికారులు నిర్ధారించారు. ఆడిట్ జరుగుతోందని తెలిసి ఆమె విధులకు గైర్హాజరైందని సమాచారం. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆమెను బలవంతంగా కార్యాలయానికి రప్పించారు. తరువాత జరిగిన విచారణలో తన తప్పు అంగీకరించిన సుభాషిణి, ఒక్క రోజులోనే మొత్తం రూ.56 లక్షలు తిరిగి జీహెచ్ఎంసీ ఖాతాలో జమ చేసింది. అయితే, ఇంత భారీ మొత్తాన్ని ఒకే రోజులో చెల్లించగలగడం వెనుక ఆమెకు ఉన్న ఇతర సంబంధాలు, వనరులు ఏమిటన్నది కూడా అధికారుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
తదుపరి చర్యలపై అనుమానాలు:
ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్న స్థాయి ఆపరేటర్ ఇంత పెద్ద మొత్తాన్ని కాజేయ గలిగితే, ఉన్నతస్థాయిలో మరెంత అవినీతి జరుగుతోందో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


