- ఏసీబీకి చిక్కిన వారిపై మెపా ఆగ్రహం
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాధన్నపేట సొసైటీ లో నూతన సభ్యుల ప్రవేశం విషయంలో లంచం డిమాండ్ చేసిన మత్స్యశాఖ అధికారులు నాగమణి, హరీష్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటనలో మత్స్యశాఖ అధికారి నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారిని ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించాలని, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పులి రాజేష్ ముదిరాజ్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ ముదిరాజ్, ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) నాయకులు డిమాండ్ చేశారు. పులి రాజేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. అవినీతి అధికారులు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని, వీరిని సస్పెండ్ చేయడమే కాకుండా శాశ్వతంగా సేవల నుండి తొలగించాలని పేర్కొన్నారు. గతంలోనే ఈ అధికారిని మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ కలిసి పలు గ్రామాల సొసైటీ రిజిస్ట్రేషన్ల విషయమై కలసి మాట్లాడినప్పటికీ, ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని తెలిపారు. అనేక సొసైటీల విషయంలో ముదిరాజ్ సమాజానికి ఇబ్బందులు కలిగించారని, ఇకపై అధికారులు ముదిరాజుల పట్ల స్నేహభావంతో వ్యవహరించాలని హెచ్చరించారు.


