ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
పేదల హక్కులను కాలరాసే ప్రయత్నం
ఎన్‌డీఏ ప్రభుత్వంపై ఎస్‌కేఎం ఆగ్రహం
కాకతీయ, వరంగల్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన నూతన ఉపాధి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఎస్‌కేఎం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం వరంగల్ హెడో పోస్టాఫీసు సెంటర్‌లో నూతన చట్టం నకలు ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. శ్రమజీవుల హక్కులను కాలరాసే విధంగా ఈ చట్టం రూపొందించబడిందని తీవ్రంగా విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల జీవనాధారాన్ని దెబ్బతీసేలా కొత్త నిబంధనలు తీసుకురావడం దారుణమని పేర్కొన్నారు. అసలు ఉపాధి హామీ పథకాన్నే ఎత్తివేసే కుట్రలో భాగంగానే ఈ చట్టం తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను 40 శాతానికి పెంచడం ద్వారా ఉపాధి హామీని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
కార్మిక–కర్షక వ్యతిరేక చట్టాలు
ఎన్‌డీఏ ప్రభుత్వం కార్మిక, కర్షక వర్గాలకు వ్యతిరేకంగా వరుసగా చట్టాలు తీసుకువస్తోందని ఎస్‌కేఎం నేతలు మండిపడ్డారు. పేదల ఉపాధిని హరించే విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం అమలైతే గ్రామీణ పేదల జీవితం మరింత దుర్భరంగా మారుతుందని హెచ్చరించారు.
నూతన ఉపాధి చట్టాన్ని రద్దు చేసే వరకు అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్‌కేఎం నాయకులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌కేఎం జిల్లా కన్వీనర్లు సోమిడి శ్రీనివాస్, రాచర్ల బాలరాజు, ఓదెల రాజయ్య, ఊరటి హంసల్ రెడ్డి, బొల్లు ఎల్లయ్య, బొజ్జం కమలాకర్, యారా విలయ్య, జక్కుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


