ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర
కేంద్రం బిల్లులు వెంటనే ఉపసంహరించుకోవాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా కుట్ర పన్నుతోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ పథకం పేరును మార్చడం ద్వారా దాని ఆత్మ, స్ఫూర్తిని చంపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఉరి తాడు బిగిస్తోందని వ్యాఖ్యానించారు. చట్టంలో మార్పులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. పార్లమెంటులో హడావుడిగా బిల్లులు ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు.ఇప్పటికే ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ కుంటిసాకులు చెబుతున్నారని, రాష్ట్రాలకు రావాల్సిన నిధులను విడుదల చేయకుండా కేంద్రం తన అవసరాలకు వినియోగిస్తోందని ఆరోపించారు. సెస్‌ల పేరుతో రాష్ట్రాలను దోచుకుంటూ, 40 శాతం భారం రాష్ట్రాలపై మోపుతోందన్నారు.గాంధీజీ పేరును పథకం నుంచి తొలగించడం దుర్మార్గమని, గాంధీని అవమానపరచడమేనని మంత్రి మండిపడ్డారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కోట్ల మందికి జీవనాధారంగా నిలిచిందని గుర్తు చేశారు.ఉపాధి హామీ చట్టం కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్‌చైల్డ్ అని, నిఖిల్ దేయ్, అరుణ రాయ్, హరగోపాల్, శాంత సిన్హా వంటి మేధావులతో చర్చించి ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఎన్నికల్లో పట్టణ ఉపాధి హామీ తీసుకొస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, ఇప్పుడు ఉన్న పథకాన్నే తొలగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.ఫెడరల్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తోందని, దీనిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. తక్షణమే ఉపాధి హామీకి సంబంధించిన బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీజీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లోనూ మరింత విస్తరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.


