పరీక్షల ఒత్తిడిని జయించండి
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి
: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: పరీక్షలు అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే వాటిని చూసి భయపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నప్పుడే విజయం సాధ్యమవుతుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద విద్యార్థినులకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం వర్ధన్నపేటలోని ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో నేరుగా ముచ్చటించి, వారి విద్యాభ్యాసం, పరీక్షల సన్నాహాలు మరియు హాస్టల్ వసతులపై ఆరా తీశారు.
పరీక్షల సమయంలో విద్యార్థులు అనుసరించాల్సిన మెలకువలను వివరిస్తూ కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రణాళిక బద్ధంగా చదువుతూ, పాఠాలను పదేపదే పునరావృతం చేయాలన్నారు. ఒత్తిడికి లోనుకాకుండా సానుకూల దృక్పథంతో ఉండాలన్నారు. సందేహాలు ఉంటే వెంటనే ఉపాధ్యాయులు లేదా వార్డెన్లను అడిగి తెలుసుకోవాలన్నారు. పరీక్షల సమయంలో సరైన నిద్ర, పౌష్టికాహారం మరియు వ్యాయామం మానసిక ఉల్లాసానికి ఎంతో అవసరం అని అన్నారు.
జిల్లాలోని అన్ని మండలాల స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీ విద్యాసంస్థల్లో నేడు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ (ఒత్తిడి నిర్వహణ) పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పుష్పలత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి


