మున్సిపల్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు..!
రాష్ట్రవ్యాప్తంగా 345 వార్డుల్లో కాంగ్రెస్ విజయం
90కుపైగా వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు.. గట్టి పోటీ సంకేతాలు
సూర్యాపేటలో వీరజవాన్ల కుటుంబ సభ్యులు వెనుకంజలో
దేవరకద్ర మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి.. స్పష్టమైన మెజార్టీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 345 వార్డులను గెలుచుకుని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తూ ఇప్పటికే 90కుపైగా వార్డులను కైవసం చేసుకుంది. దీంతో పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ ప్రతిఘటన కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
సూర్యాపేటలో వీరజవాన్ల కుటుంబ సభ్యులు వెనుకంజ
సూర్యాపేట మున్సిపాలిటీలో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. వీరజవాన్ల కుటుంబాలకు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రస్తుతం వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. 44వ వార్డులో గాలివీరు బీరడు సంతోష్ తల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆమె ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై వెనుకబడి ఉన్నారు. అలాగే 46వ వార్డులో కార్గిల్ వీరజవాను కుటుంబానికి చెందిన అభ్యర్థి మౌరికా కూడా ప్రస్తుతం
వెనుకంజలో కొనసాగుతున్నారు. వీరజవాన్ల కుటుంబాలకు చెందిన అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా బరిలోకి దింపినప్పటికీ, ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్ ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. తుది ఫలితాల వరకు ఈ వార్డులపై ప్రత్యేక ఉత్కంఠ నెలకొంది.
దేవరకద్ర మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 7 వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీపై ఆధిపత్యాన్ని సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 4 వార్డుల్లో విజయం సాధించగా, బీజేపీ కేవలం ఒక వార్డుకు మాత్రమే పరిమితమైంది.
దీంతో దేవరకద్ర మున్సిపాలిటీ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరింది. ఈ విజయంతో మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతుండగా, బీఆర్ఎస్ పార్టీ కూడా పలు చోట్ల గట్టి పోటీ ఇస్తోంది. మిగిలిన వార్డుల ఫలితాలు వెలువడిన తర్వాతే పూర్తి స్థాయి రాజకీయ దృశ్యం స్పష్టమయ్యే అవకాశం ఉంది.


