వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కర్రలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నేషనల్ హెరాల్డ్ పెట్టుబడుల వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను అక్రమంగా చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బుధవారం వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు వరంగల్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో నర్సంపేట బీజేపీ నాయకుడు, జిల్లా బీజేపీ కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారి, ఇరు వర్గాల కార్యకర్తలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఘటనతో బీజేపీ జిల్లా కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.



