నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం
నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్
నందికొండలో 12లో 11 వార్డులు కాంగ్రెస్ ఖాతాలో
ఒక్క వార్డులో మాత్రమే బీఆర్‌ఎస్‌కు విజయం
భారీ మెజారిటీలతో కాంగ్రెస్ అభ్యర్థుల దూకుడు
కాకతీయ, నల్గొండ : నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, నందికొండ మున్సిపాలిటీలో కూడా ఏకపక్ష విజయంతో హస్తం జెండా ఎగురవేసింది. మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 11 వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీపై పూర్తి పట్టు సాధించింది. బీఆర్‌ఎస్ పార్టీ కేవలం ఒక వార్డులో మాత్రమే విజయం సాధించగలిగింది.
నందికొండలో కాంగ్రెస్ జైత్రయాత్ర
నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు.
1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి యాకిడి నాగ మల్లేశ్వరి 225 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, 2వ వార్డులో నటువ నరేందర్ 71 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 3వ వార్డులో గూడపర్తి రాజా ప్రసాద్ 314 ఓట్లు, 4వ వార్డులో మంద గౌతమి 256 ఓట్లు, 5వ వార్డులో పాయర్డు బాబురావు 359 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 6వ వార్డులో అంగోతు చందులాల్ 247 ఓట్లు, 7వ వార్డులో మైలపల్లి జానకి 342 ఓట్లు, 9వ వార్డులో ఇర్ల రామకృష్ణ 399 ఓట్లతో విజయం సాధించారు. 10వ వార్డులో వినిషా 361 ఓట్లు, 11వ వార్డులో పగడాల నాగరాజు 295 ఓట్లు, 12వ వార్డులో స్వర్ణ మానస 324 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఒక్క వార్డులో మాత్రమే బీఆర్‌ఎస్ విజయం
నందికొండ మున్సిపాలిటీలో 8వ వార్డులో మాత్రమే బీఆర్‌ఎస్ అభ్యర్థి నకిరేకంటి రమణ 129 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మిగతా అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు నమోదు చేసింది. నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో నల్గొండ జిల్లాలో పార్టీ బలాన్ని మరోసారి చాటుకుంది. భారీ మెజారిటీలతో సాధించిన విజయాలు కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యతను తీసుకొచ్చాయి.


