పరకాల మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం
చైర్మన్‌గా పావుశెట్టి సునీల్, వైస్ చైర్మన్‌గా దివ్యవిద్యాసాగర్ ప్రమాణం
22 వార్డుల్లో 13 గెలిచి కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం
అభివృద్ధే లక్ష్యం.. ప్రజల విశ్వాసం నిలబెడతాం : ఎమ్మెల్యే రేవూరి
కాకతీయ, పరకాల: పరకాల మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు అధికారికంగా కొలువుదీరారు. మొత్తం 22 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 13 వార్డుల్లో విజయం సాధించి మున్సిపల్ పాలనలో స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్‌గా పావుశెట్టి సునీల్, వైస్ చైర్మన్‌గా ఏకు దివ్యవిద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కౌన్సిలర్లు తమ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి 13 మంది కౌన్సిలర్లను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకే ప్రజలు మద్దతుగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుని పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు.
రూ.73 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
ఇప్పటికే రూ.38 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మరో రూ.35 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి పరకాలను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు. మంచినీటి సరఫరా, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అలాగే విద్యారంగ అభివృద్ధి కోసం ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ఐటీఐ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు 13 స్థానాలు, బీఆర్ఎస్‌కు ఆరు స్థానాలు మాత్రమే లభించాయని గుర్తుచేసిన ఎమ్మెల్యే, గెలిచిన కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు విఫలమయ్యాయని విమర్శించారు. పరకాల నియోజకవర్గంలో రౌడీయిజాన్ని చట్టపరంగా అణచివేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కుంకుమేశ్వర ఆలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, చైర్మన్ పావుశెట్టి సునీల్, వైస్ చైర్మన్ ఏకు దివ్యవిద్యాసాగర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


