హుస్నాబాద్‌లో కాంగ్రెస్ ప్రభంజనం..!
వరుసగా నాలుగు వార్డుల్లో విజయం
ప్రారంభ ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యం
కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు
ఇతర పార్టీలకు షాక్ ఇచ్చిన ఫలితాలు
కాకతీయ, హుస్నాబాద్ : హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో వరుసగా నాలుగు వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ప్రారంభ రౌండ్ల నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపు దిశగా దూసుకెళ్లారు.
4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం సాధించారు. అదే విధంగా 5వ వార్డులో బొలిశెట్టి రాజు గెలుపొందగా, 6వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ కాంగ్రెస్‌కు మరో విజయాన్ని అందించారు. 7వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ విజయం సాధించి కాంగ్రెస్ విజయపరంపరను కొనసాగించారు.
వరుస విజయాలతో హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బలంగా నిలుస్తోందని స్పష్టమవుతోంది. ఈ ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాల వద్ద హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే నాలుగు కీలక వార్డులను గెలుచుకోవడంతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మిగిలిన వార్డుల ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొనగా, తుది ఫలితాలు వెలువడిన తర్వాత పూర్తి చిత్రంపై స్పష్టత రానుంది.


