కాంగ్రెస్ బీ–ఫామ్‌లపై ఎమ్మెల్యే పెత్తనం చేయొద్దు
పార్టీ వ్యవహారాల్లో జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించం
కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలి
పదేళ్లుగా పనిచేసిన వారిని విస్మరించొద్దు
ఎమ్మెల్యే సంజయ్ ఏపార్టీలో ఉన్నాడో ఆయనకే తెల్వదు
మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్
కాకతీయ, జగిత్యాల : కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసలు ఏ పార్టీలో ఉన్నాడో కూడా స్పష్టత లేని ఎమ్మెల్యే రాజ్యాంగం, నైతిక విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బీ–ఫామ్‌లు ఇవ్వడం ఎమ్మెల్యే పని కాదని స్పష్టం చేసిన జీవన్ రెడ్డి, పార్టీ టికెట్లపై పెత్తనం చెలాయించాలనుకోవడం సరికాదన్నారు. ఎమ్మెల్యేగా ప్రజాపాలనకు, సంక్షేమ పథకాలకు మద్దతిస్తే స్వాగతిస్తామని, కానీ పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు.
పార్టీని నడిపించేది కార్యకర్తలే
పార్టీని నడిపించేది కార్యకర్తలేనని, టికెట్లు కూడా పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలకే ఇవ్వాలన్నదే తన స్పష్టమైన డిమాండ్ అని జీవన్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం రక్తం చిందించిన వారిని పక్కన పెట్టి బయటి జోక్యాలను అనుమతించబోమని కఠిన స్వరంతో హెచ్చరించారు. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవడం సహజ ప్రక్రియేనని జీవన్ రెడ్డి అన్నారు. తాను కూడా గతంలో ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై అప్పటి ముఖ్యమంత్రిని కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లలేదని స్పష్టం చేస్తూ, ఎమ్మెల్యే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. గౌరీ శంకర్ ఇన్ఫ్రా నిర్మాణ సంస్థకు సింగిల్ టెండర్ ద్వారా పనులు అప్పగించడంలో ఉన్న అంతర్యం ఏమిటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రెండేళ్లు గడుస్తున్నా సమీకృత మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి రాకుండా గోదాంగా మార్చేశారని మండిపడ్డారు. ఇదేనా అభివృద్ధి అని ఎమ్మెల్యేను నిలదీశారు. యావర్ రోడ్డు విస్తరణ పనులకు అడ్డుపడుతున్నది కూడా ఎమ్మెల్యేనేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తల హక్కులను కాపాడటం తన బాధ్యత అని స్పష్టం చేసిన జీవన్ రెడ్డి, పార్టీ వ్యవహారాల్లో అనవసర జోక్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మరోసారి తేల్చిచెప్పారు.


