- ప్రజలు పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలి
- రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రేవంత్
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి: ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాయకులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత నాయకులు, కార్యకర్తలదేనన్నారు. బీఆర్ఎస్ నేతలు పదేండ్లలో రాష్ట్రంలో ఆర్థిక, పాలన వ్యవస్థలను విధ్వంసం చేశారని, వాటిని ప్రణాళిక ప్రకారం సరి చేసుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు.
రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయని తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం అందించాలనే తపనతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం నిలబడిన కాంగ్రెస్ పార్టీ అని, బీఆర్ఎస్ ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలు అమలు చేయలేదని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని సీతక్క అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళవలసిన అవసరం ప్రతీ ఒక్క కార్యకర్త పై ఉందన్నారు. పేద కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రామ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, తదితరులు పాల్గొన్నారు


