రైతులను రోడ్డు మీదేసిన కాంగ్రెస్
అన్నదాతలకు శాపంగా కాంగ్రెస్ పాలన
యూరియా కొరతపై తీవ్ర విమర్శలు
రైతు బీమా.. పంటల బీమాపై నిర్లక్ష్యం
కాంగ్రెస్.. బీజేపీల మధ్య మైత్రి బంధం
మాజీమంత్రి, బీఆర్ ఎస్ నేత సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతాంగం గోస పడుతోందని, రాష్ట్రాన్ని బాగు చేస్తారని నమ్మి ఓట్లేస్తే.. రైతులను నడి రోడ్డున నిలబెడుతున్నారంటూ వ్యవసాయశాఖ మాజీమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒక్క యూరియా బస్తాకు భార్యభర్తలిద్దరూ క్యూ లైన్లలో నిల్చోవాల్సి వస్తోందని విమర్శించారు. రైతాంగం, సాగు అవసరాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు వైఖరి లేకపోవడమే రైతుల కష్టాలకు కారణమని అన్నారు. చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అడ్డగోలుగా వాదనలు వినిపిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పుట్ట మధు, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తనోబా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జై జవాన్.. జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు రైతులను రోడ్ల మీద పడేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 117.83 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నట్లు అధికారులు ప్రణాళికలు, నివేదికలు ప్రభుత్వానికి అందినా.. ఎరువుల ఇండెంట్, సరఫరాలో ప్రభుత్వం ఘెరంగా వైఫల్యం చెందిందని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు 5.25 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే సరఫరా జరిగిందన్నారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల పైగా లోటు ఉందని తెలిపారు. మార్క్‌ఫెడ్ వద్ద 2 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉండాలని, కానీ కేవలం 23 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 2022లో 1.35 కోట్ల ఎకరాలలో సాగు జరిగి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యింది. ఇప్పుడు వరి సాగు తగ్గినా యూరియా సరఫరా చేయలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యమని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పులను ఒకరిపై ఒకరు వేసుకుంటూ రైతాంగానికి కష్టాలు మిగుల్చుతున్నారని అన్నారు.
రైతు బీమా.. పంటల బీమాపై నిర్లక్ష్యం..
రైతు బీమా పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీమంత్రి ఆరోపించారు. గత ఏడాది ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడంతో 5 వేల కుటుంబాలు బీమా ప్రయోజనం కోల్పోయాయని గుర్తు చేశారు. ఈ ఏడాది రూ.1359.66 కోట్లు అవసరమయ్యే రైతు బీమా ప్రీమియం సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, పంటల బీమా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. భారీ వర్షాల కారణంగా పంటలు మునిగిపోయినా, ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వలేదని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ మైత్రి
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మైత్రి బంధం కొనసాగుతోందని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం, పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో రెండు పార్టీలు కలిసి రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టాయని అన్నారు. ఐదేళ్లు ఫలితాలు ఇచ్చిన కాళేశ్వరం నీటిని వదిలేసి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు అని తీవ్రంగా విమర్శించారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, రైతు సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైంది. యూరియా కూడా సకాలంలో అందించలేని ఈ ప్రభుత్వానికి సిగ్గులేదా? అంటూ ప్రశ్నించారు.


