కరీంనగర్‌లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ
ఉద్రిక్తతల నడుమ బైఠాయింపు
పలువురు కాంగ్రెస్ నేతల అరెస్ట్
కాకతీయ, కరీంనగర్ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపుమేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరి, చైతన్యపురి కాలనీలో ఉన్న బీజేపీ ఎంపీ క్యాంపు కార్యాలయానికి శాంతియుతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ముందస్తు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుందన్న అంచనాతో పోలీసులు పలువురు కాంగ్రెస్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి పీటీసీకి తరలించారు.
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు
ఈ సందర్భంగా కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర సంస్థలను దుర్వినియోగం చేసి ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించారని, కోర్టు తీర్పుతో బీజేపీ రాజకీయ కక్ష స్పష్టమైందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో నెహ్రూ కుటుంబం స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికను కాపాడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు విరాళాలు ఇచ్చారని గుర్తు చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి అక్రమాలు లేవని కోర్టు తేల్చిన నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ ద్వారా వేధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతియుత నిరసనకు వెళ్లిన తమను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిరాజు హుస్సేన్, బానోతు శ్రావణ్ నాయక్, అరుణ్ కుమార్, మల్లికార్జున రాజేందర్, ఆకారపు భాస్కర్ రెడ్డి, కర్ర రాజశేఖర్, కల్వల రామచందర్, లింగంపల్లి బాబు, బోనాల శ్రీనివాస్, అబ్దుల్ రహమాన్, మూల రవీందర్ రెడ్డి, చర్ల పద్మ, అహమ్మద్ అలీ, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఇమ్రాన్, వీర దేవేందర్, కామ్రెడ్డి రాంరెడ్డి, సలీముద్దీన్, ఎస్.ఏ. మోసిన్, పడిశెట్టి భూమయ్య, కాశెట్టి శ్రీనివాస్, కోటగిరి భూమా గౌడ్, పొన్నం మధు, మునిగంటి అనిల్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, కోడూరి రవీందర్ గౌడ్, గంట కళ్యాణి, హసీనా, మీసా రమాదేవి, స్వప్న శ్రీ, బషీరుద్దీన్, కుర్ర పోచయ్య, రూపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సరిల్ల రతన్ రాజు, సాయిని తిరుపతి, జీడి రమేష్, తోట అంజయ్య, మంద మహేష్, శిల్పా, సుదర్శన్, కొండ హరీష్ తదితరులు పాల్గొన్నారు.


