కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్!
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం
పరకాల అభివృద్ధి చల్లా ధర్మారెడ్డి ఘనత
కాంగ్రెస్ పాలనలో నిలిచిన అభివృద్ధి
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతివ్వాలి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు
కాకతీయ, పరకాల : కాంగ్రెస్ పార్టీ పూర్తిగా “దండుపాళ్యం బ్యాచ్” మాదిరిగా వ్యవహరిస్తోందని, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచిందని మండిపడ్డారు. సోమవారం పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డిని నమ్మి రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని కేటీఆర్ అన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలపై బాండ్ పేపర్ రాసిచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ప్రజా సంక్షేమం అడుగంటిపోయిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రోజూ కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని, ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదని ధ్వజమెత్తారు. మార్పు పేరుతో ప్రజలు మోసపోయారని, అన్నం కోసం వస్తే ఉన్న వస్త్రమే పోయినట్టుగా పరిస్థితి మారిందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నాయకులను నిలదీయండి
ఒక్క హామీని కూడా నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నేరుగా నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చే హామీలు చెల్లని రెండు వేల రూపాయల నోట్లలాంటివని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓట్లు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులకే వేయాలని ప్రజలను కోరారు. పరకాల పట్టణాన్ని నిజంగా అభివృద్ధి చేసింది మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డేనని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఆశీస్సులతో భారీగా నిధులు తీసుకువచ్చి పట్టణానికి రూపురేఖలు మార్చారని గుర్తు చేశారు.
రేవూరిపై చల్లా ధర్మారెడ్డి ధ్వజం
రోడ్ షోలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పరకాల పట్టణానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో నర్సంపేట నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయిన రేవూరి, ఇప్పుడు పరకాలను కూడా నిర్వీర్యం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. మెగా టెక్స్టైల్ పార్క్, ఆర్డీవో కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయం, కూరగాయల మార్కెట్, వంద పడకల ఆసుపత్రి, ఆయుష్ ఆసుపత్రి, పాలిటెక్నిక్ కళాశాల, బస్తీ దవాఖానాలు వంటి కీలక అభివృద్ధి పనులు కేసీఆర్ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. సెంట్రల్ లైటింగ్, అంబేద్కర్ సెంటర్ ప్రధాన రోడ్డు కల్వర్టు, బైపాస్ రోడ్డు, పట్టణంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు అన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటికే నిర్మించిన భవనాలకు రంగులు వేసుకుని, శిలాఫలకాలు పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. పరకాల మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్, చల్లా ధర్మారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, గండ్ర వెంకట రమణారెడ్డి, నన్నపనేని నరేందర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


