కాకతీయ, హనుమకొండ/తొర్రూరు : కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని రాబోయే ఎన్నికల్లో ఎగర వేయడానికి గ్రామం నుండి పట్టణం వరకు ప్రతి స్థాయిలో సమైక్యంగా పని చేయాలి. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం ముందుకు సాగాలి అని ఝాన్సి రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తొర్రూరు పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, వార్డు కోఆర్డినేటర్లు, యువజన, మహిళా కాంగ్రెస్ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
తాటాకు చప్పులు కాదు.. ప్రజల మద్దతే బలం..
తాటాకు చప్పులకు నేను భయపడను. ప్రజల ప్రేమ, మద్దతే నాకు బలం. ఎలాంటి అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయను. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ అభివృద్ధి కోసం నా కృషి కొనసాగుతుంది అని ఆమె అన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షులు, వార్డు కోఆర్డినేటర్లు తమ ప్రాంతాల వారీగా పార్టీ పరిస్థితులు, చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కార్యకర్తల ఉత్సాహం చూసి ఆనందం వ్యక్తం చేసిన ఝాన్సి రాజేందర్ రెడ్డి, ప్రతి ఇంటికి కాంగ్రెస్ సందేశం చేరేలా తలుపు తట్టి ప్రచారం చేయాలి. ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం స్థానిక స్థాయిలో కృషి చేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, వార్డు కోఆర్డినేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు, యువజన, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం కార్యకర్తలతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ, వారికి ఉత్సాహం నింపారు.


