కాంగ్రెస్ నేత బెదిరింపులు
గార్డియన్ హాస్పిటల్ వద్ద లారీ యూనియన్ సభ్యుల ధర్నా
కాకతీయ, వరంగల్ : కాంగ్రెస్ నాయకుడు నవీన్ రాజ్ తమపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని లారీ అసోసియేషన్ సభ్యులు శనివారం గార్డియన్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఓరుగల్లు లారీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఫిరోజ్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. లారీ అసోసియేషన్ల మధ్య రాజకీయ జోక్యంతో లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వరంగల్ నగరంలోని ధర్మారం ఓరుగల్లు లారీ అసోసియేషన్ నాయకుల మధ్య లారీ ఓనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాయకులు చెప్పినట్టు వినకపోతే లారీ సీరియల్ గా పంపించడం లేదని, తనకు నచ్చిన వారిని ఎక్కువసార్లు లోడింగ్ కు పంపిస్తున్నారని, దీంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడి అప్పులపాలు అవుతున్నామని లారీ అసోసియేషన్ సభ్యులు వాపోయారు. గతంలో నవీన్ రాజ్ తమ పదవీకాలం ఉండగానే రాజీనామా చేయాలని బలవంతం చేసి గొడవలు సృష్టించాడని, తమపై లేనిపోని ఆరోపణలు చేశాడని, తమ లారీలు సీరియల్ గా పెట్టకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఎవరైతే లారీలను అడ్డుకుంటున్నారో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లే క్రమంలో సయ్యద్ ఇస్మాయిల్ అనే లారీ ఓనర్ యాక్సిడెంట్ గురయ్యాడని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితులకు మితిమీరిన రాజకీయ జోక్యంమే కారణమని, ఈ సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని కలెక్టర్ కూడా లారీలు సీరియల్ ప్రకారం పెట్టాలని సూచించినా కొందరు నాయకులు మారడం లేదని తెలిపారు. వారిపై చర్య తీసుకోవాలని ఓరుగల్లు లారీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఫిరోజ్ అలీ కోరారు.


