- రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టి వేధించారు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు
- వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు అనుమానాదస్పద మృతిపై విచారం
- బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ అనుమానాస్పద మృతిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. మధుకర్ ధైర్యంగా, సమర్థంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని, ప్రజా సమస్యలు పరిష్కరించేలా సేవలందించారన్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ అక్కసుతో మధుకర్‌పై అక్రమ కేసులు బనాయించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారని ఆరోపించారు. పోలీసులు అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేసి తీవ్రంగా వేధింపులకు గురిచేయడంతో మధుకర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని మధుకర్ మృతిపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. మధుకర్ ది హత్య లేదా ఆత్మహత్యయా అనే దానిపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.


