మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట..!
మంత్రి వర్గంలోనూ ఇద్దరు మహిళలకు చోటు
ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
కాకతీయ, ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. మహిళా అభివృద్ధి కోసం అనేక పథకాలను మహిళల పేరుతో అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దెబ్బల సౌజన్య ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు సన్మానం చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
మహిళల అభివృద్ధే లక్ష్యం
ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరుతో మంజూరు చేయడం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బస్సుల కొనుగోలు అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే బస్సుల్లో ఉచిత ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలతో మహిళలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు.


