మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
70 శాతం స్థానాలు అధికార పార్టీ ఖాతాలోకి – పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్
కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ బలమైన పట్టు
మూడు కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్‌మేకర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఈ రోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశముందని సర్వే స్పష్టం చేసింది.
మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ ఐదు కార్పొరేషన్లలో కాంగ్రెస్‌దే పైచేయి కనిపిస్తోందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది.




కరీంనగర్–నిజామాబాద్‌లో బీజేపీ జోరు
మరోవైపు కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని సర్వే అంచనా వేసింది. ఈ రెండు కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
ఎంఐఎం కీలక పాత్ర
నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్‌మేకర్ పాత్ర పోషించే పరిస్థితి ఉందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. తుది ఫలితాల్లో ఈ మూడు చోట్ల ఎంఐఎం మద్దతు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.
బీఆర్ఎస్కు భారీ ఎదురుదెబ్బ
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో తీవ్రంగా వెనుకబడే పరిస్థితి కనిపిస్తోంది. ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‌ను కూడా గెలిచే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్ స్పష్టం చేయడం గమనార్హం.
కార్పొరేషన్ల వారీగా అంచనాలు
రామగుండం: కాంగ్రెస్ 30–34, బీఆర్ఎస్ 16–20, బీజేపీ 3–6, ఇతరులు 4–7
మంచిర్యాల: కాంగ్రెస్ 39–43, బీఆర్ఎస్ 8–12, బీజేపీ 6–9
కొత్తగూడెం: కాంగ్రెస్ 28–34, సీపీఐ 14–16, బీఆర్ఎస్ 7–9
మహబూబ్‌నగర్: కాంగ్రెస్ 26–30, బీఆర్ఎస్ 18–22, బీజేపీ 6–8
నల్లగొండ: కాంగ్రెస్ 21–26, బీఆర్ఎస్ 8–12
నిజామాబాద్: బీజేపీ 26–31, కాంగ్రెస్ 10–16, ఎంఐఎం 8–12
కరీంనగర్: బీజేపీ 24–29, కాంగ్రెస్ 14–16, ఎంఐఎం 6–9
మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యం
రాష్ట్రవ్యాప్తంగా 68 నుంచి 76 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశముందని సర్వే తెలిపింది. బీఆర్ఎస్ 29–36 మున్సిపాలిటీలకు పరిమితం కానుండగా, బీజేపీ 3–5 మున్సిపాలిటీల్లో విజయం సాధించే అవకాశం ఉంది. సుమారు 8 నుంచి 14 మున్సిపాలిటీల్లో మాత్రం హోరాహోరీ పోరు కనిపిస్తోందని వెల్లడించింది.
ఓట్ల శాతం అంచనాలు
116 మున్సిపాలిటీల పరిధిలో కాంగ్రెస్‌కు 36 శాతం ఓట్లు, బీఆర్ఎస్కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఎంఐఎంకు 2 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.
వార్డు స్థాయి ఫలితాల అంచనాలు
కాంగ్రెస్: 1210–1290 వార్డులు
బీఆర్ఎస్: 860–930
బీజేపీ: 250–270
ఎంఐఎం: 35–44
సీపీఐ: 12–17
సీపీఎం: 10–14
ఇతరులు: 90–110
ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైతే తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ బూస్ట్ లభించనుండగా, బీఆర్ఎస్కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అధికారిక ఫలితాలు వెలువడే వరకు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.


