కాంగ్రెస్ హామీలు గాలికి వదిలేసింది
ప్రజలు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గుర్తించాలి
బీఆర్ఎస్–సీపీఐ అభ్యర్థులను గెలిపించండి
మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్
కాకతీయ, రామకృష్ణాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్–సీపీఐ పొత్తులో భాగంగా బరిలో నిలిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. స్థానిక క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం, బీజోన్ సెంటర్ ప్రధాన చౌరస్తాలలో కార్నర్ సమావేశాలు నిర్వహించారు. అనంతరం 3, 4, 17, 18, 19, 20 వార్డులకు చెందిన ప్రజలను ఉద్దేశించి బాల్క సుమన్ ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు మరోసారి గుర్తుచేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీల అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్–సీపీఐ అభ్యర్థుల గెలుపు అవసరమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, సీపీఐ నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


