- బాకీ ఎగ్గొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు
- కాంగ్రెస్ ప్రభుత్వం నిజస్వరూపాన్ని అర్థం చేసుకున్న జనం
- కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే గంగూల కమలాకర్
- గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నిరసన.. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ
కాకతీయ, కరీంనగర్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగూలా కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ గాంధీ చౌక్ వద్ద ఎమ్మెల్యే గంగూల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా గంగులా మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అసలు రూపం చూపిస్తోందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతులకు మద్దతు ధర, మహిళలకు ఆర్థిక సహాయం, ఉచిత బస్సు ప్రయాణం,ఇవన్నీ నామమాత్రంగా మారాయన్నారు.
కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ మోసాన్ని బట్టబయలు చేయడానికి కాంగ్రెస్ బాకీ కార్డు రూపొందించిందన్నారు. ఈ బాకీ కార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలను చేర్చి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ఈ బాకీ కార్డును అందిస్తూ కాంగ్రెస్ వాగ్దానాల వాస్తవ పరిస్థితిని తెలియజేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాత పథకాలను కూడా ఆపేసి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కరీంనగర్ అభివృద్ధిని నిలిపివేయడం, పేదల సంక్షేమ పథకాలను తుంచి వేయడం ఈ ప్రభుత్వ దురాశకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


