మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
ముస్లింలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం
రంజాన్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే మాధవరెడ్డి
కాకతీయ, నర్సంపేట టౌన్ : రంజాన్ పండుగను పురస్కరించుకుని నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్ శివారులోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు.ముస్లిం మత పెద్దల ఆహ్వానం మేరకు హాజరైన ఎమ్మెల్యే, రంజాన్ మాసంలో పాటించే ఉపవాసాలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసి మంచి మార్గంలో నడిపిస్తాయని పేర్కొన్నారు. మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా నిరుపేద ముస్లింలకు అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం సోదరులు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి అందరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు. అనంతరం ఈద్గా వద్ద రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, సీసీ ఫ్లాట్‌ఫామ్ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్, మార్కెట్ కమిటీ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మహిళా మరియు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


