కాంగ్రెస్ గూండాల దాడి దుర్మార్గం
మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి సిగ్గుచేటు
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
కాకతీయ, మణుగూరు : మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి దుర్మార్గమని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రంగా విమర్శించారు. శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికే రక్షణ లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ గూండాల గూండాయిజం రోజురోజుకీ పెరుగుతోందని ఆరోపించారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు అడ్డుకోలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. మాజీ సీఎం కార్యాలయానికే రక్షణ లేకపోతే ప్రజలకు భద్రత ఎక్కడుంటుందని ప్రశ్నించారు. పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తించలేదని ఆరోపించారు.అభివృద్ధి కోసం అధికారం ఇచ్చిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశ కలిగిస్తోందన్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేయడం సరైంది కాదని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులకు భయపడమని, ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


