కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు
గజ్వేల్ ఘటన ప్రజాస్వామ్యంపై దాడే
కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై ప్రణాళికతోనే దాడి
మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు
నిరసనగా గజ్వేల్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు
వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా
ఉద్రిక్తతల మధ్య ఉదయం నుంచి నిలిచిన జనజీవనం
కాకతీయ,గజ్వేల్: ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, కాంగ్రెస్ గూండాలు అధికారం అండతో రెచ్చిపోయారని తన్నీరు హరీష్ రావు మాజీ మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో సోమవారం గజ్వేల్ బంద్ కొనసాగింది. ఉదయం 5 గంటల నుంచే గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలు పూర్తిగా బంద్‌లో మునిగిపోయాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బంద్ ప్రభావంతో స్థానిక వ్యాపారులు నష్టపోయారు. కేసీఆర్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బీఆర్ఎస్ శ్రేణులను కలిచివేసింది. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉంచి నినాదాలు చేశారు. గ్రామ పాలన మీటింగ్‌లో ఫ్లెక్సీ తొలగింపుతో ప్రారంభమైన వివాదానికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది.

గజ్వేల్ చరిత్రలో ఇది రెండోసారి
గజ్వేల్ రాజకీయాల్లో క్యాంపు కార్యాలయం లక్ష్యంగా మారడం రెండోసారి జరిగింది. గతంలో బీజేపీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఎలాంటి ధ్వంసం జరగలేదు. కానీ తాజా ఘటనలో అద్దాలు పగలగొట్టడం, ఫర్నిచర్ ధ్వంసం జరిగిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రెండు నిరసనల తీరులో స్పష్టమైన తేడా కనిపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ అరాచకానికి ప్రజలు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా గజ్వేల్‌లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆంక్షారెడ్డి ప్రయత్నం.. ఉద్రిక్తత
బంద్‌ను వ్యతిరేకిస్తూ ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు షాపులు తెరిపించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదాలు, స్వల్ప తోపులాటలు జరిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ నాయకులు ఆంక్షారెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఘటన సమయంలో పోలీసులు ఉన్నప్పటికీ అడ్డుకోలేదని బీఆర్ఎస్ విమర్శించింది. మధ్యాహ్నం వరకు బంద్ కొనసాగింది. ఆ తర్వాత షాపులు తిరిగి తెరుచుకున్నాయి. రోడ్లపై రద్దీ కనిపించింది. గజ్వేల్‌లో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది. ఈ ఘటన గజ్వేల్ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకువస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్‌కు రాకపోవడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీల మధ్య ఈ వివాదం మరింత వేడెక్కింది.
రాజకీయాల వల్ల వ్యాపారం దెబ్బతినకూడదని వ్యాపారులు కోరుతున్నారు. పార్టీలు సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. గజ్వేల్‌లో శాంతి భద్రతలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.


