తొర్రూరు మున్సిపల్ పోరులో కాంగ్రెస్ జెండా ఎగరాలి
కాంగ్రెస్ నాయకులకు మంత్రి వాకిటి శ్రీహరి
పట్టణ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి
కాకతీయ, తొర్రూరు : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని, పట్టణ పీఠాలన్నింటినీ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. తొర్రూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ చీఫ్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పదేళ్ల ప్రభుత్వ అహంకారాన్ని పది రోజుల్లోనే దించిన ఘనత ప్రజలదేనని అన్నారు. ప్రజా ప్రభుత్వానికి మరింత బలం చేకూరాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీలతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లే పార్టీలోనూ ఉంటాయని, వాటిని సరిదిద్దుకొని ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, కార్యకర్తలు కూడా ఈ స్థాయి నుంచి ఏ స్థాయికైనా ఎదగవచ్చని నేతలు ధైర్యం చెప్పారు. ప్రజలతో మమేకమై పనిచేస్తే రాజకీయంగా ఎదుగుదల సాధ్యమని పేర్కొన్నారు.
పదేళ్లలో అప్పుల రాష్ట్రంగా మార్చారు..
మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చారని నేతలు విమర్శించారు. నెలనెలా అప్పుల వడ్డీలకే సరిపోతున్న పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో మంత్రులకే సీఎం అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సామాన్యులకూ సీఎం అపాయింట్‌మెంట్ లభిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి కృషి చేస్తామని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు.
మినీ స్టేడియం మంజూరుకు హామీ
అనంతరం పాలకుర్తి నియోజకవర్గంలో మినీ స్టేడియం మంజూరు చేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి మినీ స్టేడియం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి స్పందనకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


