హుజురాబాద్‌పై కాంగ్రెస్ జెండా
దశాబ్దాల తర్వాత వరించిన విజయం
చైర్‌పర్సన్‌గా సుహాసిని, వైస్ చైర్‌పర్సన్‌గా అంజలి
అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రణవ్ వ్యూహాలకు ఫలితం
సమన్వయంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కీలక పాత్ర
సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఎన్నోఏళ్ల తర్వాత పట్టణ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడంతో ఆపార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ ఆరంభమైన నాటి నుంచే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించిన నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ వ్యూహాలు ఫలించాయి. “ఈసారి ఏదైనా చేసి హుజురాబాద్‌లో జెండా ఎగరవేయాలి” అన్న పట్టుదలతో ముందుకెళ్లిన కాంగ్రెస్ చివరకు లక్ష్యాన్ని సాధించింది.
సోమవారం ప్రమాణ స్వీకారం అనంతరం చైర్‌పర్సన్‌గా రోంటాల సుహాసిని, వైస్ చైర్మన్‌గా గూడూరి అంజలి ఎన్నికయ్యారు. అనంతరం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ప్రణవ్ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గెలిచిన సభ్యులను ఘనంగా సన్మానించారు. మీడియాతో మాట్లాడుతూ .. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడం వల్లే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీకి వరుస విజయాలు దక్కుతున్నాయని అన్నారు. ఇకపై హుజురాబాద్‌లో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉంటారని, పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు తెచ్చి మరింత పురోగతి సాధిస్తామని తెలిపారు. ఇంతటి మెజారిటీతో ఆశీర్వదించిన హుజురాబాద్, జమ్మికుంట ప్రజలకు ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ప్రణవ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రద్దుకు బీఆర్ఎస్ డిమాండ్
హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఓట్లను తారుమారు చేశారంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను బయటకు తీసుకురావడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని బీఆర్ఎస్ కౌన్సిలర్ గందె శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పలు వార్డుల్లో గెలవాల్సిన తమ అభ్యర్థులు అన్యాయంగా ఓటమి పాలయ్యారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు చైర్‌పర్సన్ ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. ఎన్నికల ప్రక్రియను నిరసిస్తూ సభ నుంచి గందె శ్రీనివాస్, వర్దినేని రవీందర్రావు, కేసిరెడ్డి లావణ్య, బండ సింధుజ, బండ నరేష్, సమ్మరీన్, ప్రతాప తార, ప్రతాప మంజుల వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల వాకౌట్‌తో మున్సిపల్ కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.


