ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఖాయం
: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూమార్
కాకతీయ, జగిత్యాల : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ధర్మపురి పట్టణ అభివృద్ధికి మరింత బలం చేకూర్చాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన వాడవాడల తిరిగి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా ధర్మపురి పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ధర్మపురి పట్టణంలో ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాలను కూడా ఆయన పరిశీలించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
ధర్మపురి పట్టణానికి చెందిన ఒడ్డెర యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఓల్లెపు శంకర్ రాజు, సంఘం ధర్మపురి మండల అధ్యక్షుడు తాపళ్ల శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. శంకర్ రాజుతో పాటు యువ నాయకులు సంపంగి రవి, ఉప్పుల శివ, దండ్ల రాజేశ్, సంపంగి శేఖర్, సంపంగి సంజీవ్, రాజేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


