విద్యారంగంపై కాంగ్రెస్‌కు శ్రద్ధే లేదు
“రైసింగ్ తెలంగాణ కాదు… ఫాలింగ్ తెలంగాణ”
ప్రభుత్వంపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఘాటు విమర్శలు
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యకు కనీసం 20 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బాలల హక్కుల పరిరక్షణ వేదిక–తెలంగాణ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రవణ్, కాంగ్రెస్ ప్రభుత్వం విద్య రంగానికి అరకొర నిధులు మాత్రమే కేటాయిస్తూ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పుకునే “రైసింగ్ తెలంగాణ” నినాదం వాస్తవానికి “ఫాలింగ్ తెలంగాణ”గా మారిందని ఎద్దేవా చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. విద్య, వైద్య రంగాలపై వెచ్చించే ఖర్చులను వ్యయంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడులుగా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అవసరమైన నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలపై నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడితనం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండున్నరేళ్లయినా విద్యా విధానం లేదు
ప్రభుత్వ బడులకు నిధులు లేకపోవడం, ప్రైవేటు విద్యాసంస్థలపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల రాష్ట్ర విద్యారంగం గందరగోళంలో పడిపోయిందని దాసోజు శ్రవణ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే ప్రజాపాలన, పారదర్శకత కేవలం మాటలకే పరిమితమైందని, హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వానికి నిజాయితీ లేకపోవడం వల్లే కేంద్రం నుంచి నిధులు రావడం లేదని ఆరోపించారు. నిజాయితీ లేమి, నిధుల కొరత, నియంత్రణ రాహిత్యం కలిసి విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయని తెలిపారు. మార్పు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఆ మార్పుకు అనుగుణంగా స్పష్టమైన విద్యా విధానాన్ని రూపొందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్క సమగ్ర విద్యా విధానం కూడా రూపొందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం, విద్యారంగానికి మాత్రం తగిన నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ కాకపోయినా అజారుద్దీన్‌ను మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన ప్రభుత్వం, ప్రొఫెసర్ కోదండరామ్‌ను విద్యాశాఖ మంత్రిగా నియమించేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి హార్వర్డ్ యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతున్నారని, కానీ రాష్ట్రంలోని పేద విద్యార్థుల భవిష్యత్తుకు మాత్రం నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ ఘాటుగా వ్యాఖ్యానించారు.


