కాంగ్రెస్ కుట్రలు ఫలించవు
కరీంనగర్ నగర అభివృద్దే లక్ష్యం
డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
కాకతీయ, కరీంనగర్ : నగరపాలక సంస్థలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని కట్టబెట్టిన నగర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. కరీంనగర్‌లోని గోదాంగడ్డ ఎస్‌బీఎస్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ విజయానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పోటీ చేసే అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానం, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితో పాటు గెలుపు కోసం శ్రమించిన పార్టీ శ్రేణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నూతన మేయర్‌గా ఎన్నికైన కొలగాని శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజల శ్రేయస్సు కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్‌ను ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. 30 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉందని విమర్శించారు. 14 స్థానాలు గెలిచినప్పటికీ మేయర్ పదవిపై హక్కు చెప్పడం ప్రజల తీర్పును వక్రీకరించే ప్రయత్నమని మండిపడ్డారు. ప్రజల ఆశీర్వాదం తమ పక్షాన ఉన్నందున ఎలాంటి కుట్రలు ఫలించవని అన్నారు. సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


