ప్రజల తీర్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి
అసెంబ్లీకి రాని కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలా
బీఆర్ఎస్ నేతల విమర్శలు భయానికి నిదర్శనం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : మార్పును కోరిన ప్రజల స్పష్టమైన తీర్పుతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ప్రజల తీర్పుకు నిదర్శనమన్నారు. గత పాలనలో ప్రజా సమస్యలను విస్మరించిన బీఆర్ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల పాటు ఫామ్‌హౌస్‌కే పరిమితమై ప్రజలతో సంబంధం కోల్పోయారని తీవ్రంగా విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని అవమానించిన తీరు
అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా, ఇరిగేషన్ వంటి కీలక అంశాలపై చర్చ జరిగినప్పుడు కేసీఆర్ హాజరు కాకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని మంత్రి ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులపై కీలక చర్చలు జరిగినా అసెంబ్లీకి రాకపోవడం ద్వారా ప్రజా సమస్యలపై ఆయనకు ఎంతమాత్రం ఆసక్తి లేదని స్పష్టమైందన్నారు. ప్రజలను అవహేళనగా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందన్న భయంతోనే బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. గత పాలనలో బడ్జెట్‌ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పేదల కలలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి పదవిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఎవరి దయదాక్షిణ్యాలతోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని స్పష్టం చేశారు. కేటీఆర్‌లో అహంకారం స్పష్టంగా కనిపిస్తోందని, హరీశ్‌రావు బాధ్యతలేని వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.


