కాంగ్రెస్–బీఆర్ఎస్ రెండూ ఒకే బాట
మున్సిపాలిటీల్లో ప్రజలపై పన్నుల భారం!
పట్టణాల్లో మౌలిక సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు
కేంద్రం నిధుల వల్లే తెలంగాణలో అభివృద్ధి పనులు
బీజేపీ బలపడుతుందన్న భయంతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం
మతం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్
మున్సిపాలిటీల అప్పుల భారం చివరకు ప్రజల మీదే
అవినీతి లేని పాలన బీజేపీతోనే సాధ్యం
నర్సాపూర్ అభివృద్ధికి బీజేపీ అభ్యర్థులను గెలిపించండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో పట్టణ ప్రాంతాల ప్రజలు అనేక మౌలిక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. డ్రైనేజ్ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, తాగునీటి సరఫరా సక్రమంగా లేదని, పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పిందని అన్నారు. కరెంట్ సమస్యలు సహా ఎన్నో ఇబ్బందులు పట్టణ ప్రజలను వేధిస్తున్నాయని చెప్పారు. మున్సిపాలిటీల్లో ప్రజలపై పన్నుల భారం పెరుగుతోందని రాంచందర్ రావు మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి పేరుతో పన్నులు పెంచితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందని విమర్శించారు. పన్నులు పెంచినా అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. పట్టణాల ప్రస్తుత దుస్థితిని చూస్తే ఈ రెండు ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా తెలుస్తోందన్నారు. దేశవ్యాప్తంగా రహదారులు, మౌలిక సదుపాయాలు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి చెందాయని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం లేకపోతే రాష్ట్రంలో పేదలకు 5 కిలోల ఉచిత బియ్యం ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వందే భారత్ రైళ్లు, ప్రధానమంత్రి సడక్ యోజన కింద గ్రామీణ రహదారుల నిర్మాణం అన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని వివరించారు.

బీజేపీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ భయం
తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్పష్టంగా అర్థమైందని, అందుకే బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. నర్సాపూర్తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ గాలి బలంగా వీస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ‘ముస్లిం ఈజ్ కాంగ్రెస్ – కాంగ్రెస్ ఈజ్ ముస్లిం’ అంటూ వ్యాఖ్యలు చేసినవారు ఎవరో ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. హిందువులు నివసించే ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రభుత్వ భూములను దుర్వినియోగం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని విమర్శించారు.
అవినీతి, అప్పుల ఊబిలో మున్సిపాలిటీలు
కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, ప్రతి మంత్రిపై ఏదో ఒక అవినీతి ఆరోపణ ఉందని రాంచందర్ రావు అన్నారు. మున్సిపాలిటీలను అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆ భారం చివరకు ప్రజల మీదే పడుతోందని హెచ్చరించారు. అప్పులు పెరిగితే పన్నులు పెంచడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం ఉండదని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో “టాక్స్ టెర్రరిజం” పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జైలుకు పంపుతామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ రెండున్నర సంవత్సరాలు గడిచినా ఒక్క పెద్ద నేతపైనా చర్యలు లేవని గుర్తుచేశారు. దీని వెనుక కాంగ్రెస్–బీఆర్ఎస్ రహస్య స్నేహబంధమే కారణమని ఆరోపించారు.
కాళేశ్వరం అవినీతిపై సవాల్
ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం అవుతోందని రాంచందర్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన మొత్తం అవినీతిని సీబీఐకి అప్పగించే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. ఇప్పటివరకు చేపట్టిన విచారణ కేవలం మూడు బ్యారేజీల నాణ్యతకే పరిమితమైందని విమర్శించారు. స్వచ్ఛ భారత్, అమృత్ సిటీ, స్మార్ట్ సిటీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి కేంద్ర పథకాల ద్వారానే మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం నిధులు అందిస్తోందన్నారు. డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో బీఆర్ఎస్–కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. అవినీతి లేని పాలన కావాలన్నా, మున్సిపాలిటీల్లో నిజమైన అభివృద్ధి జరగాలన్నా బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని రాంచందర్ రావు స్పష్టం చేశారు. నర్సాపూర్ పట్టణానికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కోసం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.


