నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు..!
భువనగిరి, నందికొండలో ఏకపక్ష ఆధిక్యం
హాలియా, కోదాడలో కాంగ్రెస్ జోరు
కొన్ని చోట్లే బీఆర్ఎస్, బీజేపీ ఖాతా ఓపెన్
నల్గొండ కార్పొరేషన్ ఫలితాలపై భారీ ఉత్కంఠ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : నల్గొండ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ప్రారంభ ట్రెండ్‌ను బట్టి చూస్తే ఎక్కువ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతోంది. పలుచోట్ల వరుస విజయాలు నమోదు చేస్తూ పట్టణ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం దిశగా అడుగులు వేస్తోంది.
భువనగిరి, నందికొండలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం
భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పలు వార్డుల్లో విజయం సాధించగా, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొన్ని వార్డుల్లో మాత్రమే ఖాతా తెరవగలిగాయి. నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువ వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతుండటంతో మున్సిపాలిటీ పూర్తిగా కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాలియా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఆధిక్యం సాధిస్తోంది. ప్రారంభ రౌండ్లలోనే కాంగ్రెస్ అభ్యర్థులు వరుస విజయాలు నమోదు చేయడంతో ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ కొన్ని వార్డుల్లో మాత్రమే ఆధిక్యం సాధించినప్పటికీ మొత్తం మీద కాంగ్రెస్ జోరుకు బ్రేక్ వేయలేకపోతోంది.
కోదాడలో కాంగ్రెస్ లీడ్.. కార్పొరేషన్ ఫలితాలపై ఉత్కంఠ
కోదాడ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు విజయాలు నమోదు చేయగా, మిగిలిన వార్డుల్లో కూడా పార్టీ ముందంజలో కొనసాగుతోంది. జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల మాత్రమే ఖాతా తెరవగలిగింది. బీజేపీ కూడా పరిమిత స్థాయిలో విజయాలు నమోదు చేసింది. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం డివిజన్లలో కౌంటింగ్ కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నట్లు ట్రెండ్లు సూచిస్తున్నాయి. ఈ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడం కోసం ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో తన బలాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


