కాకతీయ, నేషనల్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008లో ఉగ్రదాడికి దీటుగా ఎందుకు ప్రతిస్పందించలేదని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. విదేశీ ఒత్తిడి వల్లే కాంగ్రెస్ వెనక్కి తగ్గిందన్నారు ప్రధాని. నవీ ముంబై అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆ సమయంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముంబై ఆర్థిక రాజధాని మాత్రమే కాదు.. దేశంలో అత్యంత శక్తివంతమైన నగరాల్లోనూ ఒకటిగా నిలిచింది. అందుకే ఉగ్రవాదులు ఈ నగరంపై దాడికి పాల్పడ్డారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనతను ప్రదర్శించింది. ఉగ్రవాదులకు బలంగా మారింది. 2008 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ పై దాడి చేసేందుకు మన భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నా.. విదేశాల ఒత్తిడితో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సైనిక చర్యను అడ్డుకుంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి ఈ మధ్యే వెల్లడించారు. నాటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో కాంగ్రెస్ చెప్పాలి. ఈ తప్పిదానికి దేశం ఎంతో మందిని కోల్పోవల్సి వస్తోంది.పౌరుల రక్షణ, జాతీయ భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలకు దిగకూడదని..అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో మాజీ హోంమంత్రి పి చిదంబరం అంగీకరించడం ఈ మధ్యే చర్చనీయాంశంగా మారింది. యుద్ధం మొదలుపెట్టకూదని అమెరికా కూడా నాటి కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి సూచించిందన్నారు. చిదంబరం చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ పరోక్షంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు.


