డ్రెయినేజీ నిర్మాణం పూర్తి చేయించండి!
బల్దియా అధికారులకు భగత్ సింగ్ నగర్ వాసుల వినతి
కాకతీయ, వరంగల్ : అసంపూర్తిగా వదిలేసిన డ్రెయినేజీ నిర్మాణం పూర్తి చేయించాలని వరంగల్ నగరంలోని 19వ డివిజన్ భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులు జీడబ్ల్యూఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఈ కాలనీలో చేపట్టిన డ్రెయినేజీ నిర్మాణం కొంతవరకు వచ్చాక కాంట్రాక్టర్ నిలిపివేశారు. ఈ విషయమై కాంట్రాక్టర్ ను అడగగా, అక్కడ డ్రెయినేజీ కాలువపై ఓ ఇంటి యజమాని మెట్లు కట్టుకున్నాడని, వాటిని తాను కూలగొట్టలేనని చెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ సమస్యను బల్దియా అధికారులే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. అసంపూర్తి నిర్మాణంతో తమ ఇళ్ల ముందు మురికి నీరు నిలిచి దుర్గంధంతో తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని బల్దియా అధికారులకు భగత్ సింగ్ కాలనీ వాసులు ఆకారపు స్వాతి, జన్ను సంతోషమ్మ, పోలె పాక కరుణాకర్, గీత విజ్ఞప్తి చేస్తున్నారు.


