పెండింగ్ పనులు పూర్తి చేయండి..!
రోడ్డు విస్తరణకు ప్రజల సహకారం అవసరం
ప్రజలను ఒప్పించి రోడ్డు విస్తరణ ప్రక్రియ పూర్తి చేయాలి
నాలుగు కాలాలు నిలిచేలా నాణ్యమైన పనులు
రాజకీయాలకతీతంగా అభివృద్ధి కొనసాగాలి
ఖమ్మం నగరాభివృద్ధిపై మంత్రి తుమ్మల స్పష్టమైన ఆదేశాలు
9వ డివిజన్‌లో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన
కాకతీయ, ఖమ్మం : పెండింగ్‌లో ఉన్న నగరాభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత–జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం నగర 9వ డివిజన్ రోటరీనగర్‌లో రూ.35 లక్షల వ్యయంతో 400 మీటర్ల మేర నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని కొత్తగా చూసినవారికి స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, ముఖ్యంగా పారిశుధ్యం గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను మిగిలిన నాలుగు నెలల్లో తప్పనిసరిగా పూర్తి చేయించుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
రోడ్డు విస్తరణకు ప్రజల సహకారం అవసరం
నగరంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యేందుకు స్థానిక కార్పొరేటర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని మంత్రి తెలిపారు. విస్తరణ వల్ల నష్టపోయే పేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు, స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో టీడీఆర్ విధానాన్ని కూడా అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రోడ్డు విస్తరణతో వ్యాపారాలు పెరుగుతాయని, ఆస్తుల విలువ కూడా అధికమవుతుందని పేర్కొన్నారు. సైడ్ డ్రైన్లపై ఫుట్‌పాత్‌లు పూర్తి చేసి లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలను ఒప్పించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. నగరంలో చేపట్టిన రోప్‌వే, వెలుగు మట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. లకారం నిర్వహణలో లోపాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ రూ.35 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టామని, అవసరమైన ఇతర పనులకు కూడా మంజూరు లభించిందన్నారు. 9వ డివిజన్‌లో విద్యుత్ స్తంభాల తరలింపునకు ఎన్పిడిసిఎల్‌కు చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, మునిసిపల్ ఇంజనీర్లు, ఎన్పిడిసిఎల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


