శివనగర్‌లో అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు
బతుకమ్మ ఆటస్థలం–స్మశాన వాటిక మధ్య ఇంటి నిర్మాణం
తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ వినతి
కాకతీయ, ఖిలావరంగల్ : శివనగర్‌లో బతుకమ్మ ఆటస్థలం మరియు శివనగర్ స్మశాన వాటిక స్థలానికి మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పోలేపాక నరేందర్ ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతం వర్షాకాలంలో వర్షపు నీరు ప్రవహించే సహజ మార్గంగా ఉండటంతో పాటు, మట్టి కోటకు అతి సమీపంలో ఉండటంతో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ నిర్మాణం ప్రజా ప్రయోజనాలకు, భద్రతకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంటూ, దీనిని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకొని, ప్రజా స్థలాలను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి ఉపేందర్, కే. రాజు, జన్ను రాజు తదితరులు పాల్గొన్నారు.


