- ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ సాంగ్వార్
కాకతీయ, గీసుగొండ : ఫిర్యాదు దారులకు సత్వర న్యాయం అందించేలా ప్రతి పోలీసు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ సాంగ్వార్ ఆదేశించారు. మంగళవారం ఆయన గీసుగొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నమోదైన కేసుల దర్యాప్తు వేగంగా పూర్తి చేసి ఫిర్యాదుదారులు న్యాయం పొందేలా కృషి చేయాలని సూచించారు. స్టేషన్‌లో రికార్డు నిర్వహణ విధానం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు. డ్రగ్స్, గాంజా వంటి ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థాలపై గట్టి నిఘా ఉంచి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. చోరీలు, ఈవ్ టీజింగ్, పబ్లిక్ న్యూసెన్స్ వంటి ఘటనలు జరగకుండా సమర్థవంతమైన పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.టెక్ టీమ్ పనితీరును పరిశీలించి ఆధునిక సాంకేతికతను వినియోగించి నేరాల నిరోధక చర్యలను మరింత బలోపేతం చేయాలన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి డ్యూటీ సమయంలో విశ్రాంతి, ఆరోగ్య సంరక్షణ, పనిపట్ల ఉత్సాహం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని డీసీపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్‌ఐలు కుమార్, రోహిత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


