మామునూరు రైతులకు పరిహారం చెల్లింపు
ఎయిర్ పోర్టుకు భూసేకరణలో కీలక పరిహారం
మరికొంతమందికి చెల్లిస్తే ఇక పనులకు టేకాఫ్
కాకతీయ, వరంగల్ సిటీ : మామునూరు విమానాశ్రయ భూసేకరణలో మరో కీలక ముందుడుగు పడింది. కాన్సెంట్ అవార్డు కు ముందుకు వచ్చిన 48 మంది రైతులకు సుమారు రూ.35 కోట్లను బుధవారం రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేసింది. భూ పరిహారం పొందిన వారిలో నక్కలపల్లి గ్రామం లోని 12 మంది రైతులకు రూ. 11,48,54,976/, గాడిపల్లి గ్రామంలోని36 మంది రైతులకు రూ. 23,35,50,322/-లను ప్రభుత్వం ఒకేరోజులో సింగిల్ పేమెంట్ గా చెల్లించినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద పత్రిక ప్రకటనలో వెల్లడించారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి 256 ఎకరాల భూమి అవసరం కాగా దీనిని మూడు గ్రామాల మొత్తం 139మంది రైతుల నుంచి ప్రభుత్వం భూమిని సేకరిస్తోంది. ఇప్పటి వరకు 48 మంది రైతులకు పరిహారం చెలింపు జరగగా త్వరలో మిగిలిన రైతులకు కూడా ఇదే క్రమములో పరిహారం చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.
నా పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తా : గాడిపల్లి రైతు సావటి రాజయ్య
నాది గాడి పల్లి గ్రామం. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కొంత భూమిని కోల్పోయాను దానికి నష్టపరిహారంగా ఈరోజే ప్రభుత్వం డబ్బులు మా అకౌంట్లో జమ చేసింది. ఈ డబ్బులతో నా పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తాను. మా పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు ఈ డబ్బును వినియోగిస్తాను.
బాధే కానీ..ఇది ఆనందమే..!: గాడిపల్లి రైతు జెల్ల ప్రభాకర్
ఎయిర్ పోర్టు నిర్మాణానికి మా భూములు కోల్పోవడం బాధ కలిగిస్తోంది. అయితే వరంగల్ జిల్లా ముఖచిత్రాన్నే మార్చే అభివృద్ధికి మేం సహరిస్తున్నందుకు కొంత సంతృప్తి ఉంది. మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయమే మా జీవనాధారం. మేం మా కలలో కూడా విమానాన్ని ప్రత్యక్షంగా చూస్తామనుకోలేదు. ఎయిర్పోర్ట్ క్రింద నాది కొంత భూమి పోతోంది. దానికి నష్టపరిహారంగా నాకు ఈ రోజే ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా వచ్చాయి. ఇంత తొందరగా డబ్బులు రావడం చాలా ఆనందంగా ఉంది.


