కమ్యూనిస్టులు ఐక్యంకావాలి
ఎర్రజెండా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
రాజ్యాంగ హక్కుల్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ
సీపీఐ సెమినార్‌లో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: దేశంలో నిరంతరం పేదల పక్షాన నిలబడి పోరాడే కమ్యూనిస్టుల ఐక్యత తక్షణ కర్తవ్యం అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబాబాద్‌లోని లయన్స్ భవనంలో భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకత అనే అంశంపై విజయ సారథి అధ్యక్షతన జరిగిన సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగింంచారు. కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయి బలహీనపడడం వల్లనే దేశంలో మతోన్మాదులు పెరిగిపోయారన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని మోడీ ప్రభుత్వం నియంతృత్వ, ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించిన విపక్షాలు, మేధావులు, కవులు, కళాకారులపై కక్ష గట్టి అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. పేదల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, ఎర్రజెండా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం సాధ్యమని, కమ్యూనిస్టులు విడిపోవడంతోనే దేశంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. కమ్యూనిస్టులు ఐక్యం కావాలని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలి
ఈనెల 18న ఖమ్మంలో జరిగే సిపిఐ జాతీయ శతవార్షికోత్సవాల ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కోరారు. చరిత్రలో నిలిచిపోయేలా శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ జనవరి 18న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు హాజరుకానున్నట్లు తెలిపారు. వందేళ్ల సిపిఐ సమర చరిత్రను నేటి తరానికి తెలియజేయడంతో పాటు సమకాలిన రాజకీయ పరిస్థితులు, మతోన్మాద ప్రమాదం, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు తదితర విషయాలను నేటి తరానికి తెలియజేసి భవిష్యత్తు పోరాటాలకు కార్యోన్ముఖులను చేసేందుకు ఈ సభ దోహదపడుతుందన్నారు. ఖమ్మం ఎస్ఆర్ ఆండ్ బీజిఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే ఈసభకు అన్ని రాష్ట్రాల నుంచి సిపిఐ నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. జనవరి 19 నుంచి 21 వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మం సప్తపది ఫంక్షన్ హాల్లో జరుగుతాయన్నారు. 18న బహిరంగ సభ సందర్భంగా స్థానిక పెవిలియన్ మైదానం నుంచి 15 వేల జనసేవాదళ్ కార్యకర్తలు కవాతు చేస్తారని, వీరితో పాటు కళాకారులు వృత్తి సంఘాలకు ప్రాతినిథ్యంవహిస్తూ ప్రజా సంఘాల కార్యకర్తలు ఆయా వృత్తుల వేషధారణలతో పాల్గొంటారని తెలిపారు.
20న జాతీయ స్థాయి సెమినార్
ఖమ్మంలో జనవరి 20న జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించనున్నట్లు తక్కళ్లపల్లి తెలిపారు. ఈ సెమినార్‌కు అన్ని వామపక్షాల జాతీయ నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సిపిఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబి, వామపక్షాల నేతలు దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. భారతదేశంలో వామపక్ష ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై జాతీయ స్థాయి సెమినార్ జరుగుతుందని ఆయన తెలిపారు.


