కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అండతోనే ప్రభుత్వాలు ఏర్పాడుతున్నాయని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమాఖ్య జాతీయ సమావేశంలో పాల్గొన్న మహేశ్ కుమార్ మాట్లాడుతూ..స్వాతంత్ర్య పోరాటంలో భాగం కాని వాళ్లు..ఈ రోజు దేశాన్ని ఏలుతున్న వాళ్లు..మతం పేరుతో దేశాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మతతత్వ శక్తుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనమంతా ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు.
రాజ్యాంగం స్థానంలో మనస్మ్రుతిని అమలు చేయాలని కుట్రలు జరుగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ ఆశయమైన..ఎవరు ఎంతో వారికంతా వాటా నినాదాన్ని సఫలం చేసిన ఘనుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. స్థానిక సంస్థలు, విద్యా ఉపాధిలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు చట్టాలను తీసుకువచ్చి దేశానికి రోల్ మోడల్ గా నిలిచామన్నారు. దేశ రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మతవాద శక్తులను అడ్డుకోవాలని ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించారు.


