కరీంనగర్‌లో అర్ధరాత్రి కమిషనర్ గస్తీ
రాత్రి భద్రత పర్యవేక్షణ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం అర్ధరాత్రి పట్టణంలో అకస్మికంగా గస్తీ నిర్వహించి రాత్రి పోలీసింగ్‌ను బలోపేతం చేశారు. రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి తర్వాత వరకు ఆయన ముఖ్య రోడ్లు, జంక్షన్లు, సున్నిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. పౌర భద్రత, పోలీసు ప్రతిస్పందనపై రాత్రివేళల్లో కూడా సమగ్ర పర్యవేక్షణ కొనసాగుతోందని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.గౌష్ ఆలం వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పరిధిలోని రౌడీషీటర్ల ఇళ్లను సందర్శించి వారి ప్రవర్తన, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేరాలకు పాల్పడే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో నిలకడగా, మంచి ప్రవర్తనతో జీవించాలని సూచించారు.తెలంగాణ చౌక్, కమాన్, కోతిరాంపూర్, గణేష్‌నగర్ వంటి ప్రాంతాల్లో రాత్రి క్రమశిక్షణ, వ్యాపార సంస్థల కార్యకాలాలపై ఆయన తనిఖీ చేశారు. అనుమతి ఉన్న సమయాలకు మించి హోటళ్లు, దుకాణాలు తెరిచి ఉంచొద్దని వ్యాపారులకు సూచించారు.గస్తీలో ఉన్న సిబ్బంది, పహారా టీంలతో మాట్లాడి వారి పనితీరును కమిషనర్ సమీక్షించారు. పెట్రోలింగ్ పాయింట్లు, రియాక్షన్ టైమ్, రాత్రివేళల్లో రోడ్లపై మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పర్యవేక్షణ, అనుమానితుల తనిఖీల విధానం వంటి అంశాలను పరిశీలించారు. వన్ టౌన్ స్టేషన్‌కు చేరుకుని డైరీ రికార్డులు, డ్యూటీ రోస్టర్లు, రాత్రి ఎంట్రీలను కూడా చెక్ చేశారు.అర్ధరాత్రి గస్తీ అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, రాత్రిపూట పహారా బలంగా ఉండటం ప్రజల భద్రతకు అత్యంత అవసరమని తెలిపారు. అకస్మిక తనిఖీలు పోలీసింగ్‌లో జవాబుదారీతనాన్ని పెంచుతాయని చెప్పారు. రాత్రి పూట కూడా ప్రజలు భద్రంగా ఉన్నారన్న నమ్మకం కలిగించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ గస్తీలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రాంచందర్‌రావు, సృజన్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్‌తో పాటు నిగ్బట్ పహారా సిబ్బంది, బ్లూ కోల్ట్స్, క్యూఆర్‌టి అధికారులు పాల్గొన్నారు



